బ్లాగులోని విషయాలకై వెతకండి

Tuesday 15 July 2014

అలీన శకం నుంచి స్వేచ్ఛా వాణిజ్య ఆరంభం వరకూ... (భారత్-అమెరికా సంబంధాలు)

అమెరికా రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం నుంచి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా, స్పష్టంగా చెప్పాలంటే నిత్యం కలహించుకునే రెండు అగ్రరాజ్యాల కూటములలొ ఒకదానికి నాయకురాలిగా, వ్యవహరిస్తోంది. ప్రత్యక్షంగా దాడులు చేసుకున్నది లేకపోయినా రెండో ప్రపంచ యుద్ధం అనంతరం సోవియట్ రష్యా, అమెరికాలు ప్రపంచ దేశాలను ఉపయోగించి చదరంగం ఆడుకున్నాయి. ఇక 1990నాటికి సోవియట్ రష్యా విచ్చిన్నమై విడివిడి రాజ్యాలుగా ఏర్పడడంతో ఆ చదరంగానికి తెరపడి అమెరికా ఏకైక మహాశక్తిగా అవతరించినట్టైంది. ఈ నేపథ్యంలో భారత్-అమెరికా సంబంధాలు తెలుసుకోవడం ఒక ఆసక్తికలిగిన పాఠకుడిని చకితుణ్ణి చేస్తుంది. కాశ్మీర్, బంగ్లాదేశ్, అణుశక్తి వంటి భారతదేశానికి సంబంధించిన విషయాలపై పాక్షికంగా స్పష్టత వస్తుంది. ఐతే ఈ అంశంపై ఇది మొదటి పోస్టు-దీంట్లో స్వాతంత్ర యుగం నుంచి స్వేచ్చా వాణిజ్య శకం వరకూ వివరిస్తాను. అమెరికా వైపు నుంచి చెప్పాల్సి వస్తే కోల్డ్ వార్ ప్రారంభం నుంచి సోవియట్ రష్యా పతనం వరకూ ఈ పొస్ట్ కొనసాగుతుంది.

1945-స్వాతంత్రానికి మూల్యం 

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన ఈ సంవత్సరం నాటికే బ్రిటిష్ రాజ్య వ్యవహర్తల్లో భారత స్వాతంత్ర ప్రకటన తప్పనిసరి అని నిర్ణయమైపోయింది. భారత స్వాతంత్ర చట్టం వెలువడింది. అనంతర పరిణామాల వలన దేశం రక్తసిక్త విభజనతో ఇస్లాం రాజ్యంగా పాకిస్తాన్, సెక్యులర్ రిపబ్లిక్ గా  ఇండియాలు ఏర్పడ్డాయి. ఆ విభజనలో బెంగాల్ విభజన, పంజాబ్ విభజన కారణంగా హిందువులు, ముస్లిములు, సిక్ఖుల మధ్య దారుణమైన మత ఘర్షణలు జరిగాయి. ఈ పరిణామాల్లో పదిలక్షల మంది మరణించగా, రెండు కోట్ల మంది తమ స్వస్థలాలను, ఆస్తులను వదులుకుని వలస వెళ్ళారు.

అలీన శకం 

1949-అలీనోద్యమానికి మొదటి మెట్టు


1949నాటికి ప్రపంచం యుద్ధానికి   భారతదేశం ప్రథమ ప్రధాని  పండిట్ నెహ్రూ  సిద్ధమైన రెండు వర్గాలుగా విడిపోవడం ప్రారంభించింది. ఆంగ్లో అమెరికా కూటమికీ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్(యు.ఎస్.ఎస్.ఆర్) కూటమికీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం(కోల్డ్‌వార్‌గా సుప్రసిద్ధం) ప్రారంభమౌతోంది. ఒక పక్షానికి అనుకూలమైతే మరో పక్షానికి అనివార్యంగా శత్రువు కావాల్సివచ్చేది. ఒక్కో కూటమి మరో కూటమి దేశాల సరిహద్దుల్లో తమకు అనుకూలమైన దేశాలను తయారుచేసుకుని వాటికి ఆయుధ సంపత్తినిస్తూ అచ్చంగా అంతర్జాతీయ చదరంగం ఆడేవి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన భారతదేశం ఈ రెండు పక్షాల్లోనూ చేరకుండా రెండిటితోనూ మైత్రి కొనసాగించాలన్న సైద్ధాంతిక నిర్ణయం తీసుకుంది. ఈ సూత్రమే అనంతరకాలంలో అలీనోద్యమంగా ప్రపంచవ్యాప్తమైంది. 
949లో నాటి భారత ప్రధాని పండిట్ జవరర్లాల్ నెహ్రూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పర్యటించి అప్పటి అమెరికా అధ్యక్షుడు హార్రీ ట్రూమన్‌ను కలిశారు. ఈ పర్యటనలోనే భారతదేశం ప్రచ్ఛన్న యుద్ధంలో తాను వ్యవహరించబోయే అలీన పద్ధతిని ప్రకటించారు నెహ్రూ. ఈ విధానమే ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో భారత్-అమెరికా సంబంధాలను నిర్దేశించింది. వాషింగ్టన్‌తో సంబంధాలు బలహీనంగా ఉండడం, తద్వారా ఢిల్లీతో మాస్కో మంచి అనుబంధం ఏర్పరుచుకోవడం కూడా దీనివల్లే సాధ్యపడింది.
1949లో నెహ్రూ అమెరికాలో పర్యటించడానికి వచ్చినపుడు వాషింగ్టన్ ఎయిర్ పోర్ట్ వద్ద ఘన స్వాగతం: అమెరికాలో నెహ్రూ
ప్రధానిగా తన తోలి పర్యటనలో గుంపులను ఉద్వేగపరిచేలా, చింతనాపరులకు ఆసక్తి గొలిపేలా,
రాజకీయవేత్తలకు అనుమానం(భవిష్యత్ భారత్-అమెరికా సంబంధాలపై) కలిగేలా మాట్లాడారు.
కొలంబియా విశ్వవిద్యాలయంలో అమెరికా అంతర్జాతీయ ఆసక్తులకు వ్యతిరేకంగా
"ప్రపంచాన్ని రెండు కలహించే వర్గాల శిబిరంగా ఏర్పాటు చేయడాన్ని" స్పష్టంగా ఖండించారు.
అయినా "షికాగో సన్ టైమ్స్" ఆయనను థామస్ జాఫర్ సన్ తో క్రిస్టియన్ సైన్స్ మానిటర్ పత్రిక "వరల్డ్ టైటాన్"గా అభివర్ణించారు.
సెయింట్ లూయీస్ పత్రికలో కాలమిస్ట్ ప్రకారం మహిళలు కంటతడి పెట్టుకుంటూండగా
నెహ్రూ అమెరికన్లను (మనల్ని) విడిచి వెళ్ళారు. కానీ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రముఖులు ఆయనను గొప్పగా తలుచుకోలేదు.
స్టేట్ సెక్రటరీ డీన్ అచీసన్ తో జరిపిన చర్చలు ఫలించకపోగా అచీసన్ నెహ్రూ గురించి "నేనేదో బహిరంగ సభ
అయినట్టు నాతో మాట్లాడాడని" తిరస్కార భావంతో వెల్లడించారు. మొత్తంగా నెహ్రూ అచీసన్ కు చాలా కఠినుడయిన(Toughest)మనిషిగా తోచాడు . 

1959-61 బలహీనమైన బంధాలు 

1959 ప్రెసిడెంట్ ఐసెన్హోవర్ భారతదేశంలో పర్యటించిన తోలి అమెరికా అధ్యక్షునిగా నిలిచారు. ఈ పర్యటనలొ ఆయన నాటి భారత రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, ప్రధాని, అలీనోద్యమ నాయకుడు పండిట్ నెహ్రూలను కలిశారు. పార్లమెంటులో ప్రసంగించారు. ఈ పర్యటన నాటికి భారతదేశం పట్ల అమెరికా వ్యూహాత్మక సంబంధాలు నెరపుతూనే ఉన్నా భారతదేశ అలీనత, ఆ దేశ ప్రధాని ప్రపంచానికి బోధిస్తున్న అలీనోద్యమం పట్ల అనుమాన దృక్కులతోనే, ఇంకా స్పష్టంగా చెప్పాల్సివస్తే వ్యతిరేకతతో, ఉన్నారు. కమ్యూనిస్టు రష్యాను దక్షిణ భాగం నుంచి వ్యూహాత్మకంగా నిలువరించేందుకు 1953 నుంచే పాకిస్తాన్ కు సైనిక శిక్షణలో, ఆయుధపరంగా అమెరికా చేస్తున్న సహకారం భారత దేశాన్ని బాధిస్తోంది.  ఈ పర్యటనలో ఒక భారత జర్నలిస్టు బొంబాయిలో ఐసెన్ హోవర్ ను పాకిస్తాన్ కు అమెరికన్లు చేసే సైనిక సహకారంతో కాశ్మీర్ విషయంలో భారతదేశం నష్టపోదా? అని ప్రశ్నించగా ఆయన నియంత్రణ కోల్పోయి కొంత ఆగ్రహంతోనే, "కాశ్మీర్ వివాదం ఉందని పాకిస్తాన్ ను కమ్యూనిస్టు దురాక్రమణ ప్రమాదం నుంచి నిరాయుధుల్ని చేసి కూర్చోపెట్టలేమ"ని జవాబిచ్చారు. ఆపైన 1961లో భారత ప్రభుత్వం పోర్చుగీస్ అధీనంలో ఉన్న వలస ప్రాంతం గోవాను సైనిక చర్య ద్వారా కలుపుకుంది. ఈ చర్యను ఐక్యరాజ్య సమితిలో యు.ఎస్. ప్రతినిధిగా వ్యవహరించిన  ఎ.స్టీవెన్ సన్ తీవ్రంగా వ్యతిరేకించారు. నాటి అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనడీ ఈ ఘటనపై స్పందిస్తూ అమెరికాలోని భారత దౌత్యప్రతినిధితో ,"మీరు గత పదిహేనేళ్ల కాలాన్ని మాకు నీతులు బోధించడంలో గడిపారు, ఇప్పుడు సాధారణ దేశాలు ఎలా ప్రవర్తిసాయో అదే విధంగా ముందుకువెళ్ళారు" అని ఎద్దేవాచేశారు. భారత ప్రభుత్వం సైన్యాన్ని వెంటనే గోవా నుంచి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అమెరికా అసంతృప్తిని వెల్లడించే ఉద్దేశంతో యు.ఎస్. సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీ, అధ్యక్షుడు కెనడీ వ్యతిరేకిస్తున్నా, భారత దేశానికి ఇస్తున్న విదేశీ ఆర్ధిక సహకారంలో 1962 సంవత్సరానికి గాను 25శాతం కోటాలో కోత విధించాలని ప్రయత్నించారు.  

వ్యూహాత్మక మైత్రి 


1962-యుద్ధ సమయంలో చేయూత 

భారత్-చైనాల నడుమ యుద్ధం జరిగింది. ఇది భారత్-అమెరికా మధ్య సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. అమెరికా ఈ యుద్ధాన్ని కమ్యూనిస్టుల దురాక్రమణగా, దేశాల నడుమ సరిహద్దులను నిర్ధారించేందుకు యుద్ధం చేసే అత్యంత అనంగీకృతమైన పద్దతిగా భావించింది. హిందీ-చీనీ భాయి భాయి అంటూ చైనాతో స్నేహాన్నే కాంక్షించిన పండిట్ నెహ్రూకు మానసికాఘాతమైంది. అమెరికా అద్యక్షుడు జాన్ ఎఫ్.కెనడీని సహకారం కోరుతూ భారత ప్రధాని నెహ్రూ లేఖ రాసారు. అమెరికా భారత్ కు అనుకూలంగా  మెక్ మోహన్ రేఖనే గుర్తించింది. యుద్ధ విమానయానం విషయంలో సహకారం, ఆయుధాలు ఇవ్వడం ద్వారా సాయం చేశారు. 
భారత ప్రధానిగా నెహ్రూ అమెరికా పర్యటనలో
మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు కెన్నడీ,
చిత్రంలో భారత, అమెరికా దేశాలకు చెందిన దౌత్య
వేత్తలు, విదేశాంగ వ్యవహర్తలు ఉన్నారు. (1961 నవంబర్ 6)
అమెరికన్ అధ్యక్షుడు కెన్నడీ ఈ పరిణామపై స్పందిస్తూ
 "చైనీస్ కమ్యూనిస్టులు దశాబ్దాలుగా ముందుకు చొచ్చుకువస్తున్నారు. భారత దేశం తన ప్రయత్నాలు తానూ చేస్తోంది, ఒకవేళ భారతదేశం,450 మిలియన్ల దేశ పౌరులు ఈ స్వాతంత్ర పోరాటంలో విజయం సాధించకపోతే, మన ప్రపంచంలోని ప్రజానీకం, మరీ ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల ప్రజలు, తమ వనరులు అభివృద్ధి చేసుకునేందుకు ఉన్న ఏకైక మార్గం కమ్యూనిజమేనని నమ్ముతారు" అని ప్రకటించారు. 1961లోనే వివాదం ముదరగా అమెరికా అప్పటికే భారత్ తో తన వ్యూహాత్మక మైత్రిని నెలకొల్పే ప్రయత్నాలు ప్రారంభించింది. 

1965-రెండో కాశ్మీర్ యుద్ధంలో దన్ను

1965లో పాకిస్తాన్ చర్యల వలన భారత్ తో రెండవ కాశ్మీర్ యుద్ధం జరిగింది. 1959లో రెండు దేశాల నడుమ రక్షణ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ ఆసక్తులకు అవసరమైతే అమెరికా తగిన చర్యలు తీసుకోవచ్చు, పాక్ కోరిక మేరకు సైన్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.  కానీ అమెరికా ప్రభుత్వం యుద్ధం వరకూ సాగిన ఈ ఘర్షణ పూర్తిగా పాకిస్తాన్ తప్పిదమని భావించింది. దాంతో పాక్ కు సైనిక సాయం పూర్తిగా రద్దు చేశారు.


బంధానికి బీటలు 

1971-స్థిరపడిన దూరం 


నాటి తూర్పు పాకిస్తాన్ లో ప్రారంభమైన అంతర్యుద్ధం నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ ల నడుమ మూడవ యుద్ధానికి తెరలేచింది. ఈ యుద్ధం చివరకు తూర్పు ప్రాంతం పాకిస్తాన్ నుంచి వీడిపోయి డిసెంబర్ 6న బంగ్లాదేశ్ ఏర్పాటు అయ్యేందుకు దారితీసింది. ఆనాటి తూర్పు పాకిస్తాన్ కు చెందిన తన స్వంత పౌరులపైనే పాక్ సైన్యం  హింస, దాడులకు దిగిందన్న విషయం తెలిసినా అమెరికా ఈ యుద్ధంలో పాక్ నే సమర్థించింది. చైనాతో దెబ్బతిన్న సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు పాకిస్తాన్ ను అమెరికా ఉపయోగించుకునేందుకే ఈ ప్రయత్నం జరిగిందని పరిశీలకుల భావన. ఈ నేపథ్యంలో భారత దేశం రెండున్నర దశాబ్దాలుగా కొనసాగిస్తున్న తన అలీన విధానాన్ని హఠాత్తుగా ముగిస్తూ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్(యు.ఎస్.ఎస్.ఆర్)తో ఇరవై సంవత్సరాలకు మైత్రి, సహకారాలను ఏర్పరుచుకుంటూ ఒప్పందాలు చేసుకుంది.  

బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాకిస్తాన్ కు
సమర్ధించడాన్ని తీవ్ర పదాలతో విమర్శిస్తూ  నాటి
తూర్పు పాకిస్తాన్ లో అమెరికా దౌత్యవేత్త
ఆర్చర్ బ్లడ్ తన  ప్రభుత్వ శాఖకు పంపిన చారిత్రాత్మక లేఖ 
ఈస్ట్ పాకిస్తాన్ లో ఆఖరి అమెరికన్ కౌన్సిల్ జనరల్ గా పనిచేసిన ఆర్చెర్ బ్లడ్ ఈ సందర్భంగా తన ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ అమెరికా ప్రభుత్వానికి పంపిన టెలిగ్రామ్ సుప్రఖ్యాతి పొందింది. "మన ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల అణచివేతను ఖండించడంలో విఫలమైంది..." అంటూ ప్రారంభమయ్యే ఈ టెలిగ్రామ్ లో పాకిస్తాన్ చర్యలకు మద్దతు ప్రకటించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ టెలిగ్రామ్ లో తూర్పు పాకిస్తాన్ లోని 29మంది అమెరికన్ల సంతకాలు జత చేశారు. అమెరికా విదేశాంగ శాఖలో పనిచేసిన అధికారులు ప్రభుత్వ నిర్ణయాన్ని అత్యంత ఘాటయిన పదాలతో విమర్శిస్తూ ప్రభుత్వ డిపార్ట్ మెంటుకు రాసిన ఏకైక లేఖగా పేరుపొందింది. 

1974 - అణుశక్తిగా ఆవిర్భావం 

పోఖ్రాన్ ప్రాంతంలో లిటిల్ బుద్ధ అన్న సంకేత నామంతో భారత దేశం తన మొట్టమొదటి అణుపరీక్ష చేసింది. దీనివల్ల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యులైన ఐదు దేశాలు కాక న్యూక్లియర్ శక్తిని ప్రపంచానికి ప్రదర్శించిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. ఈ పరిణామం భారత్ అమెరికాల నడుమ విభేదాలను స్థిరపరిచాయి.


1978 - అణు వివాదం 

సోవియట్ అనుకూల ప్రధాని ఇందిరా గాంధీ ఓటమి చెంది మొరార్జీ ప్రధాని కావడం, అమెరికాలో పాకిస్తాన్ అనుకూల విధానాలు అవలంబించిన నిక్సన్ స్థానంలో జిమ్మీ కార్టర్ అధ్యక్షునిగా ఎన్నిక కావడం భారత్-అమెరికా సంబంధాలకు అనుకూలంగా మారింది. అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ భారతదేశంలోని అధికారిక పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, ప్రధాని మొరార్జీ దేశాయ్ లను కలిసి, పార్లమెంటులో ప్రసంగించారు. మొరార్జీ దేశాయ్ అదే సంవత్సరం జూన్ నెలలో అమెరికాలో పర్యటించారు. 
ఇన్ని అనుకూలతలూ చివరకు ఫలించలేదు. అదే సంవత్సరం ప్రపంచంలో అణ్వాయుధాలు విస్తరించకుండా కార్టర్ ప్రభుత్వం న్యూక్లియర్ నాన్ ప్రోలిఫీకేషన్ యాక్ట్ తెచ్చింది. తద్వారా భారత్ తో సహా, నాన్ ప్రొలిఫికేషన్ ట్రీటీపై సంతకం చెయ్యని వివిధ దేశాలలో అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ ఇన్స్పెక్షన్లు చేసేందుకు అనుమతించాల్సి ఉంటుంది. భారత్ దానికి తిరస్కరించింది. ఆ పరిణామంతో అమెరికా అన్ని రకాల అణు సహకారాలను భారత్ కు నిలిపివేసింది. 

1984 - భోపాల్ విషాదం, ఇందిర హత్య 

యూనియన్ కార్బైడ్ ఫెర్టిలైజర్స్
సంస్థ అధినేత అండర్సన్‌ను
 భారత్‌కు అప్పగించమని \ా
ధితుల నిరసన(2006లో)
ఈ సంవత్సరం భారతదేశంలో రెండు తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. సిక్ఖుల పవిత్రస్థలమైన అమృత్ సర్ స్వర్ణదేవాలయంలో స్థావరం ఏర్పరుచుకున్న భింద్రన్ వాలేను పట్టుకుని, ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణచివేసేందుకు ఆపరేషన్ బ్లూస్టార్ పేరిట సైనిక దాడికి ఆదేశించారు ఇందిరా గాంధీ. కొత్త ఢిల్లీలోని ఆమె నివాసం వద్దనే సిక్ఖు మతస్తులైన అంగరక్షకులే ఆపరేషన్ బ్లూస్టార్ కు ఆదేశించినందుకు ప్రతీకారంగా కాల్చి చంపారు. అంతకు ముందు 1982లో ఆమె అమెరికాకు అధికారికంగా పర్యటించగా, అనంతరం భారత్ లో ఉన్నత స్థాయి యు.ఎస్. పర్యటనను నాటి ఉపాధ్యక్షుడు జార్జ్.డబ్ల్యు.బుష్(సీనియర్) నాయకత్వం వహించారు. ఇందిర రాజకీయ వారసునిగా ఆయన కొడుకు రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. 
ఇదే సంవత్సరం భోపాల్ లోని అమెరికన్ అధీనంలోని సంస్థ యూనియన్ కార్బైడ్ పెస్టిసైడ్ ప్లాంట్ నుంచి ప్రమాదకరమైన విషవాయువులు లీక్ కావడంతో వేలాది మంది భారతీయులు మరణించారు. భోపాల్ గ్యాస్ ట్రాజెడీగా పేరుపడ్డ ఈ దుర్ఘటనలో సంస్థ సీఈవొను బాధ్యునిగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలన్న ప్రయత్నంలో భారతీయులు విఫలమయ్యారు. భోపాల్ విషాదం వల్ల వేల కొద్దీ ప్రజలు తర్వాతి కాలంలో కూడా మరణానికి, అనారోగ్యాలకు, తీవ్ర వైకల్యాలకూ లోనవుతున్నారు. ఈ పరిణామాలు భారత్-అమెరికాల నడుమ ద్వైపాక్షిక సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఆ ప్రభావం మూడు దశాబ్దాలు గడిచినా రెండు దేశాల నడుమ సంబంధాల్లో కనిపిస్తోందంటే ఈ ఘటన తీవ్రత తెలుసుకోవచ్చు. 


1990 - అణువిధ్వంసం గురించిన భయాలు 

దేశాలు ఏర్పడిననాటి నుంచే భారత దేశం-పాకిస్తాన్ ల నడుమ తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతలకు ఎప్పుడూ కాశ్మీర్ కేంద్రంగానే ఉంటూ వస్తోంది. 1990ల కల్లా ఇరుదేశాలూ న్యూక్లియర్ పవర్స్ గా ఆవిర్భవించాయి. ఈ దేశాల మధ్య న్యూక్లియర్ యుద్ధం మొదలు కావచ్చనే అమెరికా భయాల నేపథ్యంలో  యు.ఎస్. జాతీయ రక్షణ ఉప సలహాదారు రాబర్ట్ గేట్స్ భారత్, పాకిస్తాన్లలో పర్యటించారు. కాశ్మీర్లో తోటి దేశం చొరబాటు గురించి రెండు దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలను నివారించడం ఈ పర్యటన లక్ష్యం. 

1991 

ప్రపంచీకరణ యుగంలోకి భారత్ 

భారత ప్రధాని పి.వి.నరసింహారావు, ఆయన ప్రభుత్వం భారత ఆర్ధిక వ్యవస్థలో సంస్కరణలు ప్రారంభించింది. ఈ పరిణామం భారత్-అమెరికాల నడుమ ఆర్ధిక బంధాలు అభివృద్ధి చెందేందుకు ఉపకరించింది. ప్రధాని నరసింహారావు ప్రత్యేకంగా తీసుకువచ్చి ఆర్థికమంత్రిగా నియమించిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ భారత ఆర్ధిక రంగం ప్రపంచ  వాణిజ్యానికి, పెట్టుబడులకు వీలుగా తెరచే పనిని పర్యవేక్షించారు. భారత్ లోపల కూడా పెట్టుబడులు పెట్టడాన్ని సరళీకృతం చేశారు. ఆ క్రమంలో అంతర్జాతీయ వాణిజ్యం, ప్రైవేట్ భాగస్వామ్యం పెంపు, ద్రవ్యోల్బణం నియంత్రణ, పన్నుల సంస్కరణల వలన దేశం అనంతర కాలంలో ఆర్ధిక శక్తిగా ఎదిగే వీలు పొందింది. 


సోవియట్ రష్యా పతనం-ఏక ధ్రువ ప్రపంచ ఆవిర్భావం 

వివిధ కామన్వెల్త్ దేశాలుగా యు.ఎస్.ఎస్.ఆర్. విచ్ఛిన్నపు అగ్రిమెంటుపై
 సంతకాలు చేస్తున్న సోవియట్ ప్రతినిధులు.

ప్రపంచ రాజకీయ రంగంలో అమెరికాకు ప్రబల శత్రువుగా, కమ్యూనిస్ట్ పక్షాలకు నాయకురాలిగా కొనసాగిన యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్(యు.ఎస్.ఎస్.ఆర్) పతనం చెందింది. జాతుల సమూహంగా కొనసాగిన సోవియట్ రష్యా చివరికి 15 స్వతంత్ర దేశాలుగా విచ్చిన్నమయ్యింది. దీని తర్వాత అమెరికా ప్రపంచంలో సూపర్ పవర్ గా, ఏక ధృవంగా ఏర్పడింది. సోవియట్ రష్యాను ఎదుర్కొనేందుకు వేర్వేరు దేశాల్లో శిబిరాలు, యుద్దాలతో చేసిన రాజకీయపుటెత్తుగడల లక్ష్య దేశం పతనం కావడంతో అమెరికా కొత్త భాగస్వామ్యాలు, పాత సంబంధాల పునర్విచారం వంటి పనుల్లో పదిండి. ఇది కూడా భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో మలుపుగా నిలిచింది. 

(ప్రపంచీకరణ శకంలో భారత్-అమెరికా సంబంధాలు తర్వాతి పోస్టులో)

Saturday 12 July 2014

దౌత్య విజయం

మధ్యప్రాచ్యంలో యుద్ధంతో రగులుతున్న ఇరాక్ నుంచి భారతదేశానికి చెందిన ప్రవాసులు సురక్షితంగా విడతలు విడతలుగా వెనక్కి తిరిగివస్తున్నారు. ఇరాక్, సిరియాలను ఆక్రమిస్తూ సాగుతోన్న ఐ.ఎస్.ఐ.ఎస్. ఉగ్రవాద సంస్థ అధీనంలొని ఉత్తర ఇరాక్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాసుల భద్రత ప్రమాదంలో పడిన దృష్ట్యా ఇది మంచి విజయం.  భారత ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల సమన్వయంతో చేసిన దౌత్యం, సున్నితమైనా స్థిరంగా తన శక్తియుక్తులను ప్రయోగించడం ఈ విజయానికి కారణంగా నిలుస్తున్నాయి. పశ్చిమాసియాకు చెందిన గల్ఫ్ కోా-ఆపరేటివ్ కౌన్సిల్లో సభ్యులైన పలు దేశాల నియంతలపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ రాజకీయ శక్తిని నియోగించారని, ఆమె ప్రయత్నాలకు సహకరిస్తూ విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాత సింగ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ తమ వ్యూహ, ప్రతివ్యూహాల రచనలో, సునిశితమైన దౌత్య సంప్రదింపుల నైపుణ్యం ఉపయోగించారు. ముందుగా 46మంది కేరళకు చెందిన నర్సులు సురక్షితంగా విడుదల అయ్యారు. ఆపైన 200మంది, 177మంది ప్రవాస భారతీయులు భారత్ తిరిగివచ్చారు. ఈ దౌత్య విజయం వెనుక  సుష్మా స్వరాజ్ పంపిన ఓ రహస్య బృందం ఉన్నట్టు బయటపెట్టారు. ఆమె కొందరు సీనియర్ దౌత్యవేత్తలతో కూడిన బృందాన్ని రహస్యంగా మధ్యప్రాచ్యంలో ఐ.ఎస్.ఐ.ఎస్.కు కీలక మిత్రులని భావించే దేశాలకు పంపినట్టు పత్రికలకు విడుదల అయ్యింది.
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ 

                        ఇంతకీ ఇరాక్లో ఏం జరిగిందంటే-2013 నుంచి ఇరాక్ పశ్చిమ ప్రాంతాల్లోనూ అదే ప్రాంతానికి చెందిన సిరియా సరిహద్దుల్లోనూ ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. అల్ ఖైదాతో దగ్గరి సంబంధాలున్న ఐ.ఎస్.ఐ.ఎస్ లేదా ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా అనే ఉగ్రవాద సంస్థ ఆ ప్రాంతాల్లో పట్టు బిగించడం ప్రారంభించింది. ఆ సంస్థ నాయకుడు అబూ బకర్ అల బాగ్దాదీ. అతను బిన్ లాడెన్ చురుకుగా వ్యవహరించిన రోజుల్లో అల్ ఖైదాలో ద్వితీయ శ్రేణి నాయకునిగా పనిచేశాడు. ఈ మాజీ ఆల్ ఖైదా ఉగ్రవాది నేతృత్వంలోని సంస్థ 2014 జనవరిలో చెప్పుకోదగ్గ సైనిక విజయాలతో సిరియాలో పెద్దభాగంలో, అతి కొద్దిగా ఇరాక్ లోని పశ్చిమ సరిహద్దుపై ఆక్రమణ చేశారు. ఆపైన కొన్ని నెలల పాటు సిరియాలో ఆక్రమించిన ప్రాంతాలు నిలుపుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చినా జూన్
2014 జూలై 13 నాటికి ఇరాక్, సిరియా దేశాల్లో ఐ.ఎస్.ఐ.ఎస్. స్థితి
(ముదురు గులాబీ రంగు ఐ.ఎస్.ఐ.ఎస్. ఆక్రమిత ప్రాంతం కాగా లేత గులాబీ
రంగు ఆ సంస్థ ఆక్రమించినట్టుగా సంస్థ ప్రకటించిన ప్రాంతాలు)
2014 కల్లా ఇరాక్లో రెండో అతిపెద్ద నగరమైన మోసుల్ ను ఆక్రమించి దిగ్బంధం చేశారు. 
సమర్రా ప్రాంతంలో జూన్ 5న జరిగిన దాడితో ప్రారంభించి, జూన్ 9న మోసుల్ దిగ్బంధం, జూన్ 11న తిక్రిత్ దిగ్బంధంతో కొనసాగిస్తూ ఐ.ఎస్.ఐ.ఎస్., అనుబంధ బలగాలు కలిసి పలు నగరాలను ఇతర ప్రాంతాలను స్వాధీనపరుచుకున్నాయి. ఇరాకీ ప్రభుత్వ సైన్యాలు జూన్ 13న దక్షిణ దిశగా కదలడంతో కుర్దిష్ బలగాలు వివాదాస్పదమైన ఉత్తర ఇరాక్ ప్రాంతంలోని కిర్కుక్‌లోని చమురు క్షేత్రాలపై ఆధిక్యత సంపాదించాయి. జూన్ నెలాఖరుకు ఇరాక్ ప్రభుత్వం జోర్డాన్, సిరియాలతో పాటుగా పశ్చిమ సరిహద్దుపై తన నియంత్రణను పూర్తిగా కోల్పోయింది. ఇదే సమయంలో ఆ నగరాలలోని బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలు చేజిక్కడంతొ ప్రపంచంలోని అత్యంత సంపన్న ఉగ్రవాద సంస్థల్లో ఒకటిగా ఐ.ఎస్.ఐ.ఎస్. అవతరించింది. ఇక ఈ దాడికి నేపథ్యం పరిశీలిస్తే ఎన్నేళ్ళ నుంచో కొనసాగుతున్న తెగల నడుమ సమస్యలు, ఇతర పశ్చిమాసియా, మధ్య ఆసియాలోని దేశాల అవసరాలు, అన్నింటి కన్నా మిన్నగా అధికారం కోసం సున్నీ, కుర్దు, షియాల మధ్య జరుగుతున్న పోరాటాలు కారణాలుగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఇరాక్ ప్రధాని నౌరి అల్-మలికి షియా ముస్లిం. వర్గ భేదాల తీవ్రత చెప్పాలంటే ప్రధాని దేశంలో ఆత్యయిక స్థితిని విధించేందుకు కూడా సున్నీ, కుర్దు వర్గాల పార్లమెంటేరియన్లు తీవ్రంగా వ్యతిరేకించారంటే తెలుస్తుంది
                          నిజానికి ఐ.ఎస్.ఐ.ఎస్. ఉగ్రవాద సంస్థ కన్నా ఎక్కువ లక్ష్యాలు నిర్దేశించుకున్నా మౌలికంగా దానికి ఉగ్రవాద సంస్థకు ఉండే లక్షణాలన్నీ ఉన్నాయి. అల్ ఖైదా సంస్థ దీన్ని మరీ "అతివాద" సంస్థ అని వ్యాఖ్యానించి ఆ సంస్థతో సంబంధాలు తెగతెంపులు చేసుకుందంటే దాని అతివాద, ఉగ్రవాద లక్షణాల గురించి కొంతమేరకు ఊహించవచ్చు. ఇప్పుడు ఆర్థికంగా సమృద్ధి సాధించినా, మొదట్లో మాఫియా తరహా కార్యకలాపాలకు దిగి మరీ డబ్బు సంపాదించిన చరిత్ర సంస్థకు ఉన్నట్టు చెప్తారు. 
                            ఐ.ఎస్.ఐ.ఎస్ కేవలం ఉగ్రవాద సంస్థగా వ్యక్తులను చంపి భయపెట్టడం, తన ఉనికిని నిరూపించుకోవడం, వంటి అవసరాలు లేకపోవడంతో యుద్ధంలో చిక్కుకున్నవారి పరిస్థితి బాగుండే అవకాశం ఉంటుందని మొదటి నుంచీ పరిశీలకులు ఆశించినా అత్యంత అతివాద లక్షణాలతో, మాఫియా తరహా వ్యవహార శైలితో ఉండడంతో ప్రమాదావకాశాలు తక్కువగా ఏమీ లేవని వారు భావించారు. ఈ నేపథ్యంలో సద్దామ్ మరణానంతరం రాజకీయంగా పట్టుకోసం ఎదురుచూస్తున్న పూర్వ బాతిస్టులు(బాతిస్ట్ పార్టీ సద్దామ్ ద్వారా 40 ఏళ్లకు పైగా ఇరాక్ ను పరిపాలించింది.) ఐ.ఎస్.ఐ.ఎస్.తో వ్యూహాత్మక సాన్నిహిత్యం ఏర్పరుచుకున్నట్టు  భావిస్తున్నారు. ఈ పరిణామం దౌత్యంలో భారతదేశానికి చోటు కల్పించినట్టైంది. భారతీయ దౌత్యవేత్తలు  అరబ్ జాతీయవాదులుగా పేరుపడ్డ పూర్వ-బాతిస్టులతో దశాబ్దాల తరబడి తమకున్న సత్సంబంధాలను ఉపయోగించారు. 
ఈ వ్యవహారం చివరికి భారత దేశానికి సౌదీ మొదలైన దేశాలతో ఉన్న సుహృద్భావం, భారతీయ దౌత్యవేత్తల నైపుణ్యం తెలుపుతోంది. ఈ పరిణామం విదేశాల్లో, మరీ ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ దేశానికి విదేశీ మారకం తీసుకువస్తూన్న ఎందరో ప్రవాసులకు భరోసా కలిగించింది. 

Friday 4 July 2014

భారతదేశం-చుట్టూ ఉన్న ప్రపంచం

ఏ దేశమూ ఒంటరి ద్వీపం కాదు. చుట్టూ ఉన్న దేశాలతో ఆ దేశం వ్యవహరించే పద్ధతి-ఆ దేశంతో మిగిలిన దేశాలు వ్యవహరించే తీరు ఆ దేశానికి ప్రపంచంలో స్థానాన్ని నిర్ణయిస్తుంది. విదేశీ వ్యవహారాలని, దౌత్య రంగమని పేరుపడిన ఈ రంగం అంతర్గత భద్రత, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ శక్తి వంటివాటిపై ప్రభావం చూపిస్తాయి. ఈ అణుయుగంలో మాత్రమే కాదు, మధ్యయుగాల్లోనూ, దానికి ముందు ఇంకా పూర్వ చారిత్రిక యుగాల్లోనూ కూడా దేశాల బలాబలాలు దౌత్య శక్తి మాత్రమే నిర్ణయించేది. ఆనాటి దౌత్య వ్యవహారాలనే ఈ రోజు మన చరిత్రలో పెద్దభాగంగా ఏర్పడింది అన్నా పొరపాటు కాదేమో. భారత భాగ్యవిధాతల్లో దౌత్య రంగం ముఖ్యమైనది.

కానీ ఇంతటి ముఖ్యమైన రంగం గురించి, భారత అంతర్జాతీయ వ్యవహారాల గురించి భారతీయులు తెలుసుకుంటున్నది అతి స్వల్పం. తెలుగు న్యూస్ పేపర్ల మొదటి పేజీలో చూడండి దాదాపుగా అన్నీ రాష్ట్ర రాజకీయాలు, కొంతవరకూ ఆర్థిక నిర్ణయాలూ, ప్రమాదాలు కనపడతాయి తప్ప కనీసం ఒక్క దౌత్య వ్యవహారం కూడా, అది మరీ మరీ ముఖ్యమైనదని వారు భావిస్తే తప్ప, కనిపించదు. దేశం-చుట్టూ ఉన్న ప్రపంచంతో ఎలా ఉందో, మన భాగ్యరేఖలు ఎలా రాయబడుతున్నాయో తెలుసుకోకపోవడం ప్రమాదకరం. మరీ ఈ ప్రజాస్వామ్య యుగంలో ప్రజలే ప్రభువులన్నది పేరుకే కాక నిజం కావాలంటే ప్రజలకు దౌత్యపరమైన అంశాలు అవగాహన కావాలి.
కాబట్టే ఈ బ్లాగును తెరచి నాకు అవగాహన ఐనంతవరకూ దేశ అంతర్జాతీయ సంబంధాలూ, అంతర్జాతీయ ముఖచిత్రంలో చోటుచేసుకుంటున్న మార్పులు వంటివి ఆసక్తికరంగా చర్చిద్దామనుకుంటున్నాను. భారతదేశం-చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకుందాం-మీరూ నేనూ కలిసి.