బ్లాగులోని విషయాలకై వెతకండి

Saturday 12 July 2014

దౌత్య విజయం

మధ్యప్రాచ్యంలో యుద్ధంతో రగులుతున్న ఇరాక్ నుంచి భారతదేశానికి చెందిన ప్రవాసులు సురక్షితంగా విడతలు విడతలుగా వెనక్కి తిరిగివస్తున్నారు. ఇరాక్, సిరియాలను ఆక్రమిస్తూ సాగుతోన్న ఐ.ఎస్.ఐ.ఎస్. ఉగ్రవాద సంస్థ అధీనంలొని ఉత్తర ఇరాక్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాసుల భద్రత ప్రమాదంలో పడిన దృష్ట్యా ఇది మంచి విజయం.  భారత ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల సమన్వయంతో చేసిన దౌత్యం, సున్నితమైనా స్థిరంగా తన శక్తియుక్తులను ప్రయోగించడం ఈ విజయానికి కారణంగా నిలుస్తున్నాయి. పశ్చిమాసియాకు చెందిన గల్ఫ్ కోా-ఆపరేటివ్ కౌన్సిల్లో సభ్యులైన పలు దేశాల నియంతలపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ రాజకీయ శక్తిని నియోగించారని, ఆమె ప్రయత్నాలకు సహకరిస్తూ విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాత సింగ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ తమ వ్యూహ, ప్రతివ్యూహాల రచనలో, సునిశితమైన దౌత్య సంప్రదింపుల నైపుణ్యం ఉపయోగించారు. ముందుగా 46మంది కేరళకు చెందిన నర్సులు సురక్షితంగా విడుదల అయ్యారు. ఆపైన 200మంది, 177మంది ప్రవాస భారతీయులు భారత్ తిరిగివచ్చారు. ఈ దౌత్య విజయం వెనుక  సుష్మా స్వరాజ్ పంపిన ఓ రహస్య బృందం ఉన్నట్టు బయటపెట్టారు. ఆమె కొందరు సీనియర్ దౌత్యవేత్తలతో కూడిన బృందాన్ని రహస్యంగా మధ్యప్రాచ్యంలో ఐ.ఎస్.ఐ.ఎస్.కు కీలక మిత్రులని భావించే దేశాలకు పంపినట్టు పత్రికలకు విడుదల అయ్యింది.
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ 

                        ఇంతకీ ఇరాక్లో ఏం జరిగిందంటే-2013 నుంచి ఇరాక్ పశ్చిమ ప్రాంతాల్లోనూ అదే ప్రాంతానికి చెందిన సిరియా సరిహద్దుల్లోనూ ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. అల్ ఖైదాతో దగ్గరి సంబంధాలున్న ఐ.ఎస్.ఐ.ఎస్ లేదా ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా అనే ఉగ్రవాద సంస్థ ఆ ప్రాంతాల్లో పట్టు బిగించడం ప్రారంభించింది. ఆ సంస్థ నాయకుడు అబూ బకర్ అల బాగ్దాదీ. అతను బిన్ లాడెన్ చురుకుగా వ్యవహరించిన రోజుల్లో అల్ ఖైదాలో ద్వితీయ శ్రేణి నాయకునిగా పనిచేశాడు. ఈ మాజీ ఆల్ ఖైదా ఉగ్రవాది నేతృత్వంలోని సంస్థ 2014 జనవరిలో చెప్పుకోదగ్గ సైనిక విజయాలతో సిరియాలో పెద్దభాగంలో, అతి కొద్దిగా ఇరాక్ లోని పశ్చిమ సరిహద్దుపై ఆక్రమణ చేశారు. ఆపైన కొన్ని నెలల పాటు సిరియాలో ఆక్రమించిన ప్రాంతాలు నిలుపుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చినా జూన్
2014 జూలై 13 నాటికి ఇరాక్, సిరియా దేశాల్లో ఐ.ఎస్.ఐ.ఎస్. స్థితి
(ముదురు గులాబీ రంగు ఐ.ఎస్.ఐ.ఎస్. ఆక్రమిత ప్రాంతం కాగా లేత గులాబీ
రంగు ఆ సంస్థ ఆక్రమించినట్టుగా సంస్థ ప్రకటించిన ప్రాంతాలు)
2014 కల్లా ఇరాక్లో రెండో అతిపెద్ద నగరమైన మోసుల్ ను ఆక్రమించి దిగ్బంధం చేశారు. 
సమర్రా ప్రాంతంలో జూన్ 5న జరిగిన దాడితో ప్రారంభించి, జూన్ 9న మోసుల్ దిగ్బంధం, జూన్ 11న తిక్రిత్ దిగ్బంధంతో కొనసాగిస్తూ ఐ.ఎస్.ఐ.ఎస్., అనుబంధ బలగాలు కలిసి పలు నగరాలను ఇతర ప్రాంతాలను స్వాధీనపరుచుకున్నాయి. ఇరాకీ ప్రభుత్వ సైన్యాలు జూన్ 13న దక్షిణ దిశగా కదలడంతో కుర్దిష్ బలగాలు వివాదాస్పదమైన ఉత్తర ఇరాక్ ప్రాంతంలోని కిర్కుక్‌లోని చమురు క్షేత్రాలపై ఆధిక్యత సంపాదించాయి. జూన్ నెలాఖరుకు ఇరాక్ ప్రభుత్వం జోర్డాన్, సిరియాలతో పాటుగా పశ్చిమ సరిహద్దుపై తన నియంత్రణను పూర్తిగా కోల్పోయింది. ఇదే సమయంలో ఆ నగరాలలోని బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలు చేజిక్కడంతొ ప్రపంచంలోని అత్యంత సంపన్న ఉగ్రవాద సంస్థల్లో ఒకటిగా ఐ.ఎస్.ఐ.ఎస్. అవతరించింది. ఇక ఈ దాడికి నేపథ్యం పరిశీలిస్తే ఎన్నేళ్ళ నుంచో కొనసాగుతున్న తెగల నడుమ సమస్యలు, ఇతర పశ్చిమాసియా, మధ్య ఆసియాలోని దేశాల అవసరాలు, అన్నింటి కన్నా మిన్నగా అధికారం కోసం సున్నీ, కుర్దు, షియాల మధ్య జరుగుతున్న పోరాటాలు కారణాలుగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఇరాక్ ప్రధాని నౌరి అల్-మలికి షియా ముస్లిం. వర్గ భేదాల తీవ్రత చెప్పాలంటే ప్రధాని దేశంలో ఆత్యయిక స్థితిని విధించేందుకు కూడా సున్నీ, కుర్దు వర్గాల పార్లమెంటేరియన్లు తీవ్రంగా వ్యతిరేకించారంటే తెలుస్తుంది
                          నిజానికి ఐ.ఎస్.ఐ.ఎస్. ఉగ్రవాద సంస్థ కన్నా ఎక్కువ లక్ష్యాలు నిర్దేశించుకున్నా మౌలికంగా దానికి ఉగ్రవాద సంస్థకు ఉండే లక్షణాలన్నీ ఉన్నాయి. అల్ ఖైదా సంస్థ దీన్ని మరీ "అతివాద" సంస్థ అని వ్యాఖ్యానించి ఆ సంస్థతో సంబంధాలు తెగతెంపులు చేసుకుందంటే దాని అతివాద, ఉగ్రవాద లక్షణాల గురించి కొంతమేరకు ఊహించవచ్చు. ఇప్పుడు ఆర్థికంగా సమృద్ధి సాధించినా, మొదట్లో మాఫియా తరహా కార్యకలాపాలకు దిగి మరీ డబ్బు సంపాదించిన చరిత్ర సంస్థకు ఉన్నట్టు చెప్తారు. 
                            ఐ.ఎస్.ఐ.ఎస్ కేవలం ఉగ్రవాద సంస్థగా వ్యక్తులను చంపి భయపెట్టడం, తన ఉనికిని నిరూపించుకోవడం, వంటి అవసరాలు లేకపోవడంతో యుద్ధంలో చిక్కుకున్నవారి పరిస్థితి బాగుండే అవకాశం ఉంటుందని మొదటి నుంచీ పరిశీలకులు ఆశించినా అత్యంత అతివాద లక్షణాలతో, మాఫియా తరహా వ్యవహార శైలితో ఉండడంతో ప్రమాదావకాశాలు తక్కువగా ఏమీ లేవని వారు భావించారు. ఈ నేపథ్యంలో సద్దామ్ మరణానంతరం రాజకీయంగా పట్టుకోసం ఎదురుచూస్తున్న పూర్వ బాతిస్టులు(బాతిస్ట్ పార్టీ సద్దామ్ ద్వారా 40 ఏళ్లకు పైగా ఇరాక్ ను పరిపాలించింది.) ఐ.ఎస్.ఐ.ఎస్.తో వ్యూహాత్మక సాన్నిహిత్యం ఏర్పరుచుకున్నట్టు  భావిస్తున్నారు. ఈ పరిణామం దౌత్యంలో భారతదేశానికి చోటు కల్పించినట్టైంది. భారతీయ దౌత్యవేత్తలు  అరబ్ జాతీయవాదులుగా పేరుపడ్డ పూర్వ-బాతిస్టులతో దశాబ్దాల తరబడి తమకున్న సత్సంబంధాలను ఉపయోగించారు. 
ఈ వ్యవహారం చివరికి భారత దేశానికి సౌదీ మొదలైన దేశాలతో ఉన్న సుహృద్భావం, భారతీయ దౌత్యవేత్తల నైపుణ్యం తెలుపుతోంది. ఈ పరిణామం విదేశాల్లో, మరీ ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ దేశానికి విదేశీ మారకం తీసుకువస్తూన్న ఎందరో ప్రవాసులకు భరోసా కలిగించింది. 

1 comment:

  1. బాగుంది. మరిన్ని పోస్టులు అందించగలరు.

    ReplyDelete