బ్లాగులోని విషయాలకై వెతకండి

Friday 4 July 2014

భారతదేశం-చుట్టూ ఉన్న ప్రపంచం

ఏ దేశమూ ఒంటరి ద్వీపం కాదు. చుట్టూ ఉన్న దేశాలతో ఆ దేశం వ్యవహరించే పద్ధతి-ఆ దేశంతో మిగిలిన దేశాలు వ్యవహరించే తీరు ఆ దేశానికి ప్రపంచంలో స్థానాన్ని నిర్ణయిస్తుంది. విదేశీ వ్యవహారాలని, దౌత్య రంగమని పేరుపడిన ఈ రంగం అంతర్గత భద్రత, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ శక్తి వంటివాటిపై ప్రభావం చూపిస్తాయి. ఈ అణుయుగంలో మాత్రమే కాదు, మధ్యయుగాల్లోనూ, దానికి ముందు ఇంకా పూర్వ చారిత్రిక యుగాల్లోనూ కూడా దేశాల బలాబలాలు దౌత్య శక్తి మాత్రమే నిర్ణయించేది. ఆనాటి దౌత్య వ్యవహారాలనే ఈ రోజు మన చరిత్రలో పెద్దభాగంగా ఏర్పడింది అన్నా పొరపాటు కాదేమో. భారత భాగ్యవిధాతల్లో దౌత్య రంగం ముఖ్యమైనది.

కానీ ఇంతటి ముఖ్యమైన రంగం గురించి, భారత అంతర్జాతీయ వ్యవహారాల గురించి భారతీయులు తెలుసుకుంటున్నది అతి స్వల్పం. తెలుగు న్యూస్ పేపర్ల మొదటి పేజీలో చూడండి దాదాపుగా అన్నీ రాష్ట్ర రాజకీయాలు, కొంతవరకూ ఆర్థిక నిర్ణయాలూ, ప్రమాదాలు కనపడతాయి తప్ప కనీసం ఒక్క దౌత్య వ్యవహారం కూడా, అది మరీ మరీ ముఖ్యమైనదని వారు భావిస్తే తప్ప, కనిపించదు. దేశం-చుట్టూ ఉన్న ప్రపంచంతో ఎలా ఉందో, మన భాగ్యరేఖలు ఎలా రాయబడుతున్నాయో తెలుసుకోకపోవడం ప్రమాదకరం. మరీ ఈ ప్రజాస్వామ్య యుగంలో ప్రజలే ప్రభువులన్నది పేరుకే కాక నిజం కావాలంటే ప్రజలకు దౌత్యపరమైన అంశాలు అవగాహన కావాలి.
కాబట్టే ఈ బ్లాగును తెరచి నాకు అవగాహన ఐనంతవరకూ దేశ అంతర్జాతీయ సంబంధాలూ, అంతర్జాతీయ ముఖచిత్రంలో చోటుచేసుకుంటున్న మార్పులు వంటివి ఆసక్తికరంగా చర్చిద్దామనుకుంటున్నాను. భారతదేశం-చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకుందాం-మీరూ నేనూ కలిసి.

1 comment:

  1. ఇలాంటి బ్లాగులు రావాల్సిన అవసరం చాలా ఉంది. కొనసాగించండి. విజయోస్తు.

    ReplyDelete